చిన్న కథ - జంతురాజ్యంలో జింక పాలన
అనగనగా ఒక అడవి ఆ అడవి పేరు జంతు రాజ్యం . ఆ రాజ్యానికి రాజు సింహం. ఆ జంతు రాజ్యం లో చాలా జంతువులు , పక్షులు నివసిస్తున్నాయి. ఒకనాడు మహామంత్రి అయిన నక్క రాజువద్దకు వచ్చి "మహారాజా మహారాజా మన జంతురాజ్యంలో ఉన్న జంతువులన్నిటికీ ఆహారం సరిగా దొరకడం లేదు. సరిగా తిండిలేక అల్పప్రాణులైన జింక ,కుందేలు మరియు ఇతర జంతువులన్నీ నీరసించిపోతున్నాయి" అని చెప్పింది .
అప్పుడు రాజైన సింహం ఇలా చెప్పింది."మంత్రిగారు రేపు మన మర్రి చెట్టు క్రింద అన్ని జంతువులతో సభను ఏర్పాటు చేయండి" అని. మరుసటిరోజు అన్ని జంతువులు సమావేశమయ్యాయి. అపుడు సింహం వచ్చి పెద్ద బండరాయి మీద కూర్చోని " రాజ్యం లో ఉన్న బలమైన జంతువులన్నీ అంటే పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు ,దున్నలు అన్నికుడా వారానికి ఆరు రోజులు ఆహారాన్ని సేకరించి నా గుహ పక్కనే ఉన్న గుహలో భద్రపరచండి. అందులోనుండి అల్పప్రాణులకు అవసరమైనప్పుడు నేనే ఆహారపంపిణి చేస్తాను" అని చెప్పింది. అందుకు అల్పప్రాణులన్నీ సంతోషించి చప్పట్లు కొట్టాయి. పెద్ద పెద్ద జంతువలన్నీ భయంతో వివిధ రకాలఆహారాన్ని సేకరించి గుహలో భద్రపరుస్తున్నాయి.
ఆరోజు నుండి సింహం మరియు పెద్ద జంతువులన్నీ బాగానే ఉన్నాయి . కానీ అల్ప ప్రాణులైన జింక, కుందేలు , లాంటి జంతువులుకు మాత్రం ఏ వారానికో పదిరోజులకో ఒకసారి పాడయిపోయిన , పనికిరాని ఆహారం పంపిణీ జరిగేది . సరైన పద్దతిలో ఆహారం అందక అల్పప్రానులన్నీ నీరసంగానే ఉన్నాయి.
అసలు మన రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక తెలివైన జింక గుహదగ్గరగా దాక్కొని అంతా గమనించింది . ఆహారం సేకరించి గుహలో భద్రపరచడం నిజమే గానీ , మంచి ఆహారాన్ని సింహం గుహలోకి చేర్చి మరికొంత మంచి ఆహారాన్ని నక్క ,ఎలుగు,ఏనుగు దున్నలు పంచుకొని పనికిరాని పాడైన ఆహారాన్ని మాత్రం చిన్న చిన్న జంతువులకు పంపిస్తున్నాయి . సింహానికి మంచి ఆహారం అందడంతో అన్ని జంతువులకు కూడా ఇలాగే అందుతుందని అందరూ బాగున్నారనీ అనుకొంది సింహం.
ఒక తెలివైన జింక చిన్న జంతువులన్నిటితో సమావేశమై పై విషయమంతా వివరించింది. అందరూ సింహం దగ్గరకు వెళ్ళి తమ బాధ వివరించాలని అనుకున్నాయి. మర్నాడు అల్పప్రాణులన్ని సింహం దగ్గరకు వెళ్లాయి. సింహం వాటి కష్టాన్ని అంతా విని మీకు ఆహారం సక్రమంగా అందేటట్టు చేస్తాను. దోషులను శిక్షిస్తాను అని అంది. అపుడు తెలివైన జింక మహారాజా మాకు మీరు ఉచితంగా ఆహారాన్ని అందిచవద్దు .అలా ఉచితంగా అందించడం వలన మాకు సరైన ఆహారం అందడం లేదు సరికదా మేము కూడా మీరు ఆహారాన్ని అందిస్తారని పనులు మానేసి బద్దకస్తులుగా మారి మా నైపుణ్యాలను మరచి పోతున్నాము . ఇలాగే కొనసాగితే మాకు కొంతకాలానికి ఆహార సంపాదనా సామర్ధ్యం కూడా పోతుంది. కాబట్టి మాకు తగిన పనులను కల్పించండి పనులకు తగిన మూల్యాన్ని సమకూర్చండి. అని అభ్యర్థించాయి . సింహానికి జింక చెప్పింది బాగుందనిపించి తన రాజ్యంలోని సక్రమంగా పనిచేయని మంత్రులను ఇతర అధికారులను మార్చి రాజ్యపాలన సక్రమంగా ఉండేవిధంగా కొత్త పరిపాలన అధికారులను మంత్రులను యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి జింకకు మహా మంత్రి పదవినిచ్చి రాజ్యపాలన బాధ్యతలను అప్పగించింది. సింహం జింక సహకారంతో అందరికీ సరైన పనులను ఏర్పాటు చేసి వాటికి తగ్గట్టుగా తగిన మూల్యాన్ని సమకూర్చింది. అప్పటినుండి అన్ని జంతువులు హాయిగా జీవించసాగాయి.
శుభం
Smt N . ROJARANI
Teacher
M E SCHOOL JAGANNADHA PURAM
PARVATHIPURAM
2 Comments