తెలుగువారి సామెతలు
1. అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు
వివరణ :-
ఒక పనిని మొదలు పెట్టేముందు ఆ పని యొక్క లాభ నష్టాలను ముందే ఊహించి సంభదిత వ్యక్తులతో చర్చించ మని చెప్పే సందర్భం లో ఈ సామెతను వాడతారు.
2. అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు
వివరణ :-
ఒకప్పుడు అన్నం దొరకక అంటే ఎక్కువగా లభ్యం కాక అన్నానికి బదులుగా అంబలి త్రాగేవారు. అంబలి త్రాగడం అంటే చిన్న చూపు . అలా అంబలి త్రాగేవాడికి మీసాలకు ఆ అంబలి అంటకుండా పట్టుకునేవాడు ఉంటాడా ? చేసేది అల్పమైన పని, దానికి ఇంకొకడు సహాయాన్ని అడిగితే ఈ సామెత వాడతారు.
(ఇప్పుడు పోషకాహారం అని అందరూ అంబలి త్రాగుతున్నారు లెండి అది వేరే విషయం.)
3. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
వివరణ :-
అర్థంపర్థం లేని విషయాలకు వివరణలు అడిగినప్పుడు ఈ సామెతను వాడతారు. ఎంత విజ్ఞాన వంతుడైనా అర్దం పర్డం లేని విషయాలకు వివరణ ఇవ్వడలేదు కదా !
4 . అత్తలేని కోడలు ఉత్తమురాలు ,కోడలు లేని అత్త గుణవంతరాలు
వివరణ : - ఈ సామెతకు వివరణ అక్కర్లేదనుకుంటా
5 . ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
వివరణ :-
ఆలు అంటే ఇల్లాలు చూలు అంటే గర్భం . భార్య లేకపోతే కొడుకు ఎలా ?
ప్రయత్నమే లేకుండా ఫలితాలగురించి ఆలోచించే వారి గురించి ఈ సామెత వాడతారు.
వెనుకటి కెవడో "ఆలూ లేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట" అని .
శ్రీమతి రంగుముద్రి శ్రీదేవి
టీచర్
M E స్కూల్
చింతాడ వారి వీధి
పార్వతీపురం
0 Comments