Ticker

6/recent/ticker-posts

చిన్న కథలు - మంత్ర మహిమ

   lord vishnumurthy primaryschool

ఒకసారి నారద మహర్షికి సందేహం కలిగింది . "నేను నిరంతరం నారాయణ మంత్రం జపం చేస్తుంటాను కదా ! దీని ఫలితం ఏమైనా ఉందా? లేదా? ఎవర్ని అడిగితే తగిన సమాధానం దొరుకుతుంది " అని ఆలోచిస్తూ సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు చేరాడు. 


      "  ఏమిటి నారదా ! కుశలమా? " విష్ణుమూర్తి నవ్వుతూ ప్రశ్నించాడు .

    

  "స్వామీ ! మీ దయ వలన కుశలమే , కానీ నాదొక సందేహం . నారాయణా ! నారాయణా ! అని నీ నామం నిత్యం జపిస్తుంటాను . దీని ఫలితం ఏమయినా ఉందా ? " సందేహంగా నారదుడు అడిగాడు. 


           " నారదా ! నీకు సందేహమా ! అన్నీ తెలిసిన నీవు అడగడం....... "

           

           " నిజమే స్వామీ ! సందేహమే ! "

     "అయితే విను భూలోకంలో లక్ష్మీపురం  అనే గ్రామం ఉంది . అక్కడ రామయ్య అనే కూలీ ఉన్నాడు . ఆయన ఇంటివెనుక వరాహం పిల్లలు కంటుంది . ఆ పిల్లలను అడిగితే తెలుస్తుంది " అని విష్ణుమూర్తి తెలిపాడు .  " నారాయణా ! నీవు సాక్షాత్ సృష్టికర్తవు  . నీవు చెప్పింది కాదనగలనా , సరే" అని నారదుడు కదిలాడు . 


                 ఆ వరాహం పిల్లల వద్దకు నారదుడు చేరుకున్నాడు . ఆ పిల్లలలో  బలమైన దానిని చూసి " ఓ బుల్లి వరాహమా ! నీవు నారాయణ మంత్ర మహిమ చెప్పగలవా ? "అని ప్రశ్నించాడు . అది గిలగిల తన్నుకోసాగింది . " నారాయణా!  నారాయణా ! అని మంత్రించినా ఆ పిల్ల గిల గిల తన్నుకుంటూ ప్రాణం విడిచింది . నారదుడు భయంతో  పరుగుతీసి స్వర్గం చేరుకున్నాడు . జరిగినదంతా విష్ణుమూర్తితో  చెప్పాడు . 


                    " నారదా ! విప్పల వలస అనే గ్రామంలో పారయ్య ఉన్నాడు . ఆయన ఇంట గాడిద పిల్లను కంటుంది .దానిని అడిగితే చెబుతుంది " అన్నాడు . 


                      " సరే తప్పుతుందా !! " అనుకుంటూ నారదుడు కదిలాడు . 

             సరాసరి గాడిద పిల్లను చేరుకొని నారాయణ మంత్ర మహిమ చెప్పగలవా ? అంటూ చెవి దగ్గర మెల్లగా అన్నాడు . 

             గాడిద పిల్ల కాళ్లు కొట్టుకుంటూ ప్రాణం విడిచింది . 

             నారదుని శరీరం కంపించిపోయింది . తొందరగా స్వర్గం చేరి " ఇదేమిటి స్వామి ? ఈ గాడిద కూడా ప్రాణాలు విడిచింది " అంటూ భయపడిపోయాడు .

                "ఈ సారి వెంకటాపురం లో సోమయ్య అనే రైతు ఉన్నాడు. ఆయన ఇంట ఇప్పుడే పాడిగల ఆవు దూడను కంటుంది . ఆ దూడను అడిగితే సందేహం నివృత్తి అవుతుంది " అని తెలియజేశాడు  విష్ణువు .

                  "ఏం చేయను  ? ఏదో నేరం చేసి ఉంటాను " అని మనసులో అనుకుంటూ నారదుడు దూడను చేరాడు .  ఆ దూడ అందంగా కనబడుతుంది . " ఇదీ చావదు కదా ! " అనుకుంటూ " ఓ దూడా నారాయణ మంత్ర మహిమ చెప్పగలవా ? " అని దూడ చెవి దగ్గర అన్నాడు . అప్పుడే పుట్టి నిలబడిన ఆ దూడ నిలువునా కూలిపోయి , కాళ్లు తన్నుకుంటూ ప్రాణాలు విడిచింది. నారదుడికి గుండె ఆగినట్లైంది . రైతుకు గానీ తపోశక్తి ఉంటే నన్ను శపిస్తాడు  ఇక లాభంలేదు  అనుకొని స్వర్గానికి చేరాడు నారదుడు .విష్ణుమూర్తి తో "స్వామి! స్వామి! అంటూ వణికి పోయాడు .  " నారదా ! భయపడకు ఈ సారి నీ సందేహం నివృత్తి కాగలదు . " అన్నాడు విష్ణుమూర్తి .

               "విజయనగర రాజవంశంలో ఏకైక పుత్ర జననం జరుగుతుంది . సందేహింపక ఆ పుట్టిన రాచ బిడ్డను అడిగితే తెలుస్తుంది " అన్నాడు . సాక్షాత్ శ్రీమన్నారాయణుడు . " చాలు చాలు స్వామి !  "చాలు చాలు స్వామీ! చక్రవర్తి ఏకైక మగ సంతానం అంటున్నావు . వాడు నావలన చనిపోతే , మహా పాపాలు చుట్టుకుంటాయి " అన్నాడు నారదుడు . వెళ్ళు పరవాలేదు అని విష్ణువు చెప్పాడు .          

                   నారదుడు దైర్యం తెచ్చుకొని ఎవరూ లేని సమయంలో తాను ఎవ్వరికీ కనబడకుండా  రాచబిడ్డను చేరాడు . ఆ బిడ్డడు పసిడి వన్నెల ఛాయతో ముద్దుగా కనిపిస్తున్నాడు . బంగారు ఊయల , రాణివాసం చుట్టూ పరిచారికలు , అర్థరాత్రివేళ అందరూ నిద్రలో మునిగి ఉన్నారు . "బాలా ! నీవు నారాయణ మంత్రమహిమ చెప్పగలవా ? శ్రీమన్నరాయణుడు పంపగా వచ్చాను " అని సందేహం తనదైనా సరే విష్ణుమూర్తిపై  నెట్టి నారదుడు అడిగాడు . ఆ పసికందు పకాలున నవ్వింది . "ఏమి నాయనా ! నవ్వుతున్నావు  ? అంత పరిహారంగా ఉందా ? " అని అడిగాడు .

     " ఆహా! ఇంత జరిగినా అర్దం కాలేదా స్వామీ " వరాహమై పుట్టినప్పుడు చెవిలో నారాయణ మంత్రం వినిపించావు . ఆ జన్మ విడిచి గాడిద పిల్లగా పుట్టాను . అపుడు మీరు వినిపించిన నారాయణ మంత్ర మహిమతో తనువు చాలించి ఆవు దూడగా జన్మించాను . తదుపరి మీరు దూడ చెవిలో నారాయణ మంత్రం వినిపించారు . ఆ జన్మ విడిచి రాకుమారుడిగా  పుట్టాను .

         " జంతూనాం నరజన్మ దుర్లభం " . ఎన్నో జంతు జన్మల తరువాత నారాయణ మంత్రమహిమ వలననే నాకు ఉత్తమమైన మానవజన్మ  లభించింది . ఈ జన్మలో  మంచిపనులు చేస్తాను . నారాయుణినికి ఆలయాన్ని నిర్మించి స్వామీ సేవ చేస్తూ ప్రజలకు సుభిక్ష  పాలన అందిస్తాను . తద్వారా ఈ మానవజన్మని  సార్ధకం చేసుకుంటాను . అని రాజశిశువు నారదుని సందేహాన్ని నివృత్తి చేశాడు .

           నారదుని ఆనందానికి అంతలేదు . నారాయణ మంత్ర మహిమను తెలుసుకొని నారాయణ మంత్రాన్ని జపిస్తూ నారదుడు పొంగిపోతూ కదిలాడు . 



               శ్రీ బెహరా ఉమామహేశ్వర రావు
     జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
                          పార్వతీపురం
                    

Post a Comment

0 Comments